విశాఖపట్నం: రాజశ్యామల అమ్మవారు కొలువైన విశాఖ నగరం చినముషిడివాడలోని విశాఖ శ్రీశారదాపీఠం వార్షికోత్సవాలు సోమవారం అత్యంత వైభవంగా ముగిశాయి. ఈ వేడుకల్లో భాగంగా గత ఐదు రోజులుగా తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీనివాస చతుర్వేద హవనం, లోక కల్యాణార్థం శారదాపీఠం తలపెట్టిన రాజశ్యామల యాగం శాస్త్రోక్తంగా పూర్తయ్యాయి. సీఎం వైఎస్ జగన్ సోమవారం ఈ కార్యక్రమాల్లో పట్టు వస్త్రాలు ధరించి పాల్గొన్నారు. ఉదయం 11.25 గంటలకు శారదా పీఠానికి చేరుకున్న ఆయనకు మేళతాళాలు, పూర్ణకుంభంతో పీఠం ధర్మకర్తలు స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్.. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహా స్వామీజీ, ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీతో కలసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ముగిసిన విశాఖ శ్రీశారదాపీఠం వార్షికోత్సవాలు